Sunday, December 20, 2015

Chapter 9 : శత్రువు - అవరోధాలు [Part - 4]

విశ్లేషణ – 3 :


"అమ్మా! నాకు ఆ బొమ్మ కావాలి" అని పసివాడు అడుగుతాడు. ఇప్పడు కాదులే, తరువాత కొందాం అని చెప్తే ఊరుకోడు, మారం చేస్తాడు, కావాలని మొండికేసి ఏడుస్తాడు. చివరికి అమ్మ చేత ఆ బొమ్మని కొనిపించుకుంటాడు. ఇంటికెళ్ళాక ఆ బొమ్మను వాడు ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. దానితో ఆడుకుని ఎంతో ఆనందపడిపోతాడు. కొన్ని రోజులయ్యాక, ఈ బొమ్మపైనున్న ఆసక్తి, ఇష్టం తగ్గిపోతాయి, మరో కొత్త బొమ్మను కావాలంటాడు. కొత్తలో ఆకర్షించినది ఎంతో ఇష్టంగా అనిపించింది, తరువాత ఆ ఇష్టం కాస్తా తగ్గిపోయింది. దీనికి కారణం - "కోరిక". ఆ పసివాడికే కాదు, పండు ముసలివారికైనా కోరిక ఇలాగే ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఒక కోరిక తీరగానే, మరొకటి మొదలవుతుంది. జీవితకాలం అంతా గడిచినా మన కోరికలకు అంతూ పొంతూ ఉండదు. 


చిన్నపుడు బోలెడన్ని బొమ్మలు కావాలి, కొంచం ఊహ తెలిసాక ఆటలు కావాలి. ఇంకాస్త పెద్దయ్యాక కొత్త కొత్త బట్టలు, మంచి బహుమతులు కావాలి, యవ్వనంలో మంచి తోడు కావాలి, తరువాత పెళ్ళి కావాలి, పెళ్ళి అయ్యాక పిల్లలు కావాలి, పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు కావాలి, ఆ తరువాత మనుమలు, మనుమరాళ్ళు కావాలి, వారి ఉన్నతిని కూడా చూడాలి, చివరి రోజుల్లో మనుమలతో పసివాడిలా మళ్ళీ అడుకోవాలి, చివరికి ఒకరోజు కన్నుమూయాలి - ఇది ఒక సగటు మనిషి జీవితం. ఈ కోరికలు తీరితే, మరొకటి మొదలవుతుంది, కానీ, తీరకపోతే భరించలేని వేదన కలుగుతుంది. "పసివాడు బొమ్మ కావాలని ఏడవటం, మనం మన కోరిక తీరలేదని ఏడవటం, బాధపడటం" రెండూ ఒక్కటే. తేడా ఎక్కడ ఉంటుందంటే, "పసివాడు ఏడ్చి తరువాత బొమ్మ సంగతి మర్చిపోతాడు, మళ్ళీ హాయిగా నవ్వుతాడు, కానీ, మనం మర్చిపోలేక ఆ కోరిక తీరలేదని ఏడుస్తూనే ఉండిపోతాం, అంతులేని ఏడుపుకి కారణం మనలో ఉన్న ఈ బలమైన కోరికే". అలాగని, కోరిక ఉండకూడదు అని అర్థం కాదు. కోరికలు ఉండాలి, మన అవసరాలు తీరేవరకు ఉండాలి. మన అవసరాలు తీరినాక ఇంకా కోరికలే ఉంటే, అప్పుడు మన జీవితం దుఃఖమయం అయ్యే అవకాశాలే ఎక్కువ. కొత్తగా కోరిక కలగటం కన్నా, ఉన్నదానితో మనకు కలిగే "సంతృప్తి" ఎంతో ఉత్తమమైనది.
అగ్ని ఒక చోట మొదలై, చుట్టూ అంతా వ్యాపిస్తుంది. వ్యాపించి వ్యాపించి అంతా తగలబెడుతుంది. దానిని ఆర్పకపోతే దావానలంలా పెరిగిపోతూనే ఉంటుంది. మనలో ఉండే ఈ "కోరిక" స్వభావం కూడా అగ్ని వంటిదే. మనలో మొదలై చివరికి మనల్నే దహిస్తుంది. మనం కోరుకున్న దానికోసం పడే ఆరాటం ఎన్నేళ్ళైనా తీరదు, "సంతృప్తి" అనే నీటితోనే దానిని ఆర్పగలం. అది మన వల్లనే సాధ్యపడుతుంది తప్ప వేరెవరి వల్లనో కాదు. నచ్చింది కావాలి అనుకోవటంలో తప్పులేదు, కానీ, "కావాలి" అనే ఆరాటం మనల్నే దహించనంతవరకు మాత్రమే అది సరియైనది. 


"మనల్ని, మన అంతరంగాన్ని, మన చుట్టూ ఉన్న వారి హృదయాలను దహించని ఏ కోరికైనా సరియైనదే". కోరిక దాని పరిమితిలోనే ఉండాలి తప్ప పరిమితిని దాటకూడదు. ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, "కోరిక కొత్తలో ఎంత ఆకర్షణీయంగా, ఇష్టంగా ఉంటుందో, అది తీరినాక దాని ప్రాధాన్యత మన మనసులోనే తగ్గిపోతుంది, ఇది ప్రపంచంలోని ఏ వస్తువుకైనా వర్తిస్తుంది". అందుకే, మన కోరికలు మన హద్దులో ఉండాలి. మనమే కావాలని వాటిపై నియంత్రణను సాధించాలి. అప్పుడు నిజమైన సంతోషం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన, పరిమితమైన కోరికలు, ఆదర్శప్రాయమైన లక్ష్యాలు ఉంటే మన జీవితం అందంగా ఉంటుంది. "మనకున్న లక్ష్యాలను మన కర్తవ్యాలుగా భావించి పూర్తి చేయటమే మన ధర్మం. ఈ కర్తవ్య నిర్వహణలో, కొత్తగా ఎదురైన వాటిపై ప్రత్యేక అభిమానం పెంచుకోవద్దు" - అని శ్రీకృష్ణ బోధ. అది మనలోని అసలైన సామర్థ్యాన్ని, నిజాన్ని గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. అటువంటి సమయాలలో మనసులో శాంతి కరువు అవుతుంది. ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండి జీవించటమే మన పరమ కర్తవ్యం అని మరచిపోకూడదు. 


"కోరిన కోర్కెలు, కోయని కట్లు. తీరవు నీవవి తెంచక" అని అన్నమాచార్యులు తెలిపారు. మనకు మనంగా కోరికలను తెంచే దాకా అవి తెగవు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇది మానసికంగా ఎంతో కష్టంగా తోచినా, ఒకసారి "సంతృప్తి" పడటం నేర్చుకున్నాక, అసలైన సంతోషం తప్పకుండా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు చింత లేని జీవితం మన చెంతే ఉంటుంది. ఎంతటి ఐశ్వర్యం ఉన్నా, ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎంతటి కీర్తి ప్రతిష్ఠలు ఉన్నా, మనలో "సంతృప్తి" లేనప్పుడు అవన్నీ వ్యర్థమే అని మనం గ్రహించాలి. మన మనసు చాలా చంచలమైనది. కనపడిన దానివెంట పరుగులెత్తటం, విన్నదాని వెంట మనల్ని లాక్కెళ్ళటం దాని సహజమైన స్వభావం. ఎన్ని ఆకర్షణలు ఎదురైనా, వెంటనే వాటికి లొంగిపోకుండా ఉండగలగాలి. ప్రతి దానిని ఆలోచించాలి, తప్పకుండా విశ్లేషించాలి. ఏది అర్థవంతమైన కోరిక? ఏది కేవలం ఆకర్షణ? అనేవి తప్పకుండా ఆలోచించాలి. మనసుకి తోచిన దానివెంట గుడ్డిగా అడుగు వేయకపోవటమే మంచిది. ఎప్పటికప్పుడు మన ఆలోచనలను గమనిస్తూ, అవసరమైన చోట సవరిస్తూ, మనల్ని, మన ప్రవర్తనని మన నియంత్రణలోనే ఉండేలా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ముఖ్యంగా, యుక్త వయసులో ఉన్నవారికి ఇది ఎంతో అవసరం, వ్యక్తిగత ఆకర్షణలు ఎంత అందంగా అనిపించినా, చివరికి మనల్ని అవి కృంగదీస్తాయి. ఉన్నచోటనే ప్రపంచం మొత్తాన్ని పరిచయం చేసుకోగల శక్తి ఉన్న తరం ఇది, పైపైన హంగులు ఎంతో ఆకర్షిస్తాయి. ఏది ఆకర్షణ? ఏది వాస్తవం? అని కూడా ఆలోచించుకోవటం ఇప్పటి తరానికి ఎంతో ముఖ్యం.